ఇప్పుడంటే టీలో చక్కెర వేసుకుంటున్నాం కానీ ఇదివరకటి రోజుల్లో బెల్లంటీనే ఉండేది ప్రతి ఇంట్లో. అందులో కాస్త సొంఠి వేసుకుని వేడిగా తీసుకుంటే జలుబు, దగ్గు దరిచేరవనే వాళ్లు ఇంట్లోని పెద్దవాళ్లు. బెల్లంలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉన్నందున రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీర ఉష్ణోగ్రతలను నియంత్రిస్తుంది. ఈ సహజ స్వీటెనర్ ప్రాచీన కాలం నుండి భారతదేశంలో గొప్ప పదార్ధంగా పేరుగాంచింది.
ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన బెల్లంలో ఉన్న 15 ప్రయోజనాలు
1. మలబద్దకాన్ని నివారిస్తుంది: బెల్లం శరీరంలోని జీర్ణక్రియకు ఉపయోగపడే ఎంజైమ్‌లు సక్రమంగా పనిచేయడానికి ఉపకరిస్తుంది. ప్రేగు కదలికలను ప్రేరేపించడం ద్వారా మలబద్దకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. మూత్రవిసర్జన సాఫీగా జరిగేందుకు తోడ్పడుతుంది. భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తినడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి, జీర్ణక్రియకు సహకరిస్తుంది.
2. కాలేయాన్ని శుభ్రపరుస్తుంది: బెల్లం శరీరం నుండి హానికరమైన విషాన్ని బయటకు పంపిస్తుంది. తద్వారా కాలేయాన్ని శుభ్రపరచడానికి సహాయపడుతుంది
3. ఫ్లూ లాంటి లక్షణాలకు చికిత్స చేస్తుంది: చక్కెరకు బదులుగా మీ టీలో బెల్లం చేర్చండి. బెల్లం శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది, అందుకే సాధారణంగా ప్రజలు దీనిని శీతాకాలంలో తింటారు.
4. బ్లడ్ ప్యూరిఫైయర్: బెల్లానికి రక్తాన్ని శుద్ధి చేయగల సామర్థ్యం ఉంది. రోజూ పరిమిత పరిమాణంలో తీసుకుంటే రక్తం శుభ్రపడుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
5. రోగనిరోధక శక్తిని పెంచుతుంది : బెల్లం యాంటీఆక్సిడెంట్లు, జింక్, సెలీనియం వంటి ఖనిజాలతో నిండి ఉంటుంది. ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడే రోగ నిరోధకతను పెంచుతుంది.
6. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. కర్మాగారాలు లేదా బొగ్గు గనులు వంటి భారీ కలుషిత ప్రాంతాల్లోపనిచేసే ప్రజలకు బెల్లం తినడం చాలా మంచిది.
7. రుతుసమయంలో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది : బెల్లం అనేక ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన రుతు సమస్యలకు చక్కని నివారిణి. రోజూ ఒక చిన్న బెల్లం ముక్క తీసుకుంటే ఎండార్ఫిన్‌ల విడుదలకు దారితీస్తుంది. ఈ ఎండార్ఫిన్లు మీ శరీరాన్ని సడలింపజేస్తాయి. తద్వారా ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ (పిఎంఎస్) ని నివారిస్తుంది. కడుపు నొప్పిని తగ్గిస్తుంది.
8. రక్తహీనతను నివారిస్తుంది : బెల్లంలో ఇనుము, ఫోలేట్ అధికంగా ఉంటాయి. రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది. ఎర్ర రక్త కణాల సాధారణ స్థాయిని నిర్వహించేలా చేస్తుంది. గర్భిణీ స్త్రీలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.
9. పేగు ఆరోగ్యాన్ని పెంచుతుంది : బెల్లంలో మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల పేగు బలాన్ని కూడా పెంచుతుంది. ప్రతి 10 గ్రాముల బెల్లంతో, మీకు 16 మి.గ్రా మెగ్నీషియం లభిస్తుంది.
10. కడుపును చల్లబరుస్తుంది: బెల్లం శరీర ఉష్ణోగ్రతలను క్రమబద్దీకరిస్తుంది.
11. రక్తపోటును నియంత్రిస్తుంది: బెల్లంలో పొటాషియం, సోడియం ఉంటుంది. ఇవి శరీరంలో యాసిడ్ స్థాయిల నిర్వహణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇది రక్తపోటు యొక్క సాధారణ స్థాయిని సరిగ్గా నిర్వహించేలా చేస్తుంది.
12. శ్వాసకోశ సమస్యలను నివారిస్తుంది : బెల్లంను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా, ఉబ్బసం, బ్రాంకైటిస్ వంటి అనేక శ్వాసకోశ సమస్యలను నివారించవచ్చు. శ్వాసకోశ వ్యవస్థకు అద్భుతమైన ప్రయోజనాల కోసం నువ్వుల గింజలతో ఈ సహజ స్వీటెనర్ తినాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
13. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది: కీళ్ళ నొప్పులతో బాధపడుతుంటే, బెల్లం తినడం వల్ల ఉపశమనం లభిస్తుంది అని సుఖ్దా హాస్పిటల్ డాక్టర్ మనోజ్ కె. అహుజా చెప్పారు. కీళ్ల నొప్పులను తగ్గించడానికి బెల్లాన్ని అల్లం ముక్కతో కలిపితినవచ్చు.. లేదా ప్రతిరోజూ బెల్లం కలిపిన పాలు తాగవచ్చు. దీనివలన ఎముకలు బలంగా తయారవుతాయి. తద్వారా ఆర్థరైటిస్ వంటి ఎముక సమస్యలను నివారించవచ్చు.
14. బరువు తగ్గడం: బెల్లం బరువు తగ్గడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. బెల్లంలో ఉన్న పొటాషియం శరీరంలో నీటి నిలుపుదలని నియంత్రిస్తుంది. ఇది బరువును తగ్గించడానికి సహాయపడుతుంది.
15. మంచి శక్తి వనరు: చక్కెర అనేది సాధారణ కార్బోహైడ్రేట్, ఇది రక్తంలో కలిసిపోయి తక్షణ శక్తిని ఇస్తుంది. బెల్లం అనేది సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్. రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే పెరగవు. శరీర అలసటను, బలహీనతను నివారించడానికి కూడా సహాయపడుతుంది.
Follow Facebook, Twitter , Blog
#AutismAyurvedam #covid19 #panchakarma #drsanthisree
0 Comments