Gastritis !! – Know how to overcome by yourself.. Positive Results Guaranteed..
గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎందుకు వస్తుంది ? ఎలా తగ్గించుకోవాలి ?
మనం తీసుకున్న ఆహారం కడుపులో తిరిగి వండబడుతుంది . వండే అగ్నిని జఠరాగ్ని అంటారు . అందుకు వివిధ రకాల యాసిడ్లు సహకరిస్తున్నాయి . జఠరాగ్ని బలంగా ఉంటే తీసుకున్న ఆహారం సక్రమంగా ”వచనం ” అవుతుంది . ఇలా కడుపులో వచనం చేసే అగ్నినే పాచకాగ్ని జఠరాగ్ని అని పిలుస్తుంటాం . ఈ అగ్ని తగ్గిపోతే, తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు . అజీర్తిగా ఉంది అంటుంటాం అప్పుడు , దీన్నే అగ్నిమాంద్యం అంటాం . కడుపులో జఠరాగ్ని తగ్గి అగ్నిమాంద్యం ఏర్పడితే సమస్తమైన వ్యాధులూ ప్రారంభం అవుతున్నట్లు లెక్క . ” అగ్ని ” బలంగా ఉన్నవారికి విషం పెట్టినా ఏమీకాదు . అమాంతం హరాయించుకోగలుగుతున్నారు .
గ్యాస్ … గ్యాస్ … గ్యాస్
అధోమార్గంలోంచి , పెద్ద పెద్ద శబ్దాలు చేసుకొంటూ ఆపానవాయువులు వెళ్ళడం , త్రేన్పులు , విరేచనం సరిగ్గా అవ్వకపోవడం ఒక్కోసారి పదే పదే వెళ్ళాలనిపించడం , ఎన్నిసార్లు వెళ్ళినా ఫ్రీగా అవ్వకపోవడం , కడుపులో గడబిడమంటూ ప్రేగులు అరుస్తుండటం , శరీరం బరువుగా బడలికగా బద్దకంగా ఉండటం , తలతిరుగుడు , తలనొప్పి , నడుములోంచి , వెన్నులోంచి పోటు మొదలై నడుం బిగుసుకుపోవడం దాహం , జ్వరం వచ్చినట్లుండటం , వాంతి అవ్వడం , వికారం పుట్టి వాంతి అయితేగానీ సుఖం లేదనిపించటం … ఇవన్నీ అజీర్తి వలన కలిగే లక్షణాలు , అంటే కడుపులో అగ్ని తగ్గిపోయినందువలన ఏర్పడే బాధలన్నమాట ….. అగ్ని మందగించి , కడుపులో వాతం పెరిగితే విరేచన మార్గం దగ్గర కత్తిరించినట్లు పోటుపుడుతుంది .
అన్నం అరగకుండా సగం పక్వమై సగం పక్వo కాకుండా మిగిలిపోయినప్పుడు సహజంగానే పులిసిపోతుంది కదా ! లోపల జీర్ణక్రియకు ఉపకరించే యాసిడ్లు దానితో కలిసి మరింత పులిసిపోతుంది . పుల్లటి త్రేన్పులు , నోట్లో నీళ్ళూరటం, గొంతులో మంట , గుండెల్లో మంట, కడుపులో మంట , శరీరంలో పొగలు వెళ్తున్నట్లు మంటగా ఉండటం , చెమటలు అధికంగా పట్టడం , తల తిరుగుడు పదే పదే నీళ్ళు త్రాగాలనిపించడం … ఇలాంటి బాధలన్నీ వస్తాయి . తరచూ నోటిపూత , గ్యాస్ ట్రబుల్ , అల్సర్లు వంటి వ్యాధులు రావటానికి ఇదిగో … ఈ జఠరాగ్ని మందగించటమే ముఖ్య కారణం .
ఎసిడిటీ తగ్గితేనే అగ్ని పెరుగుతుంది :
అగ్నిమాంద్యం వలన అన్నం జీర్ణంకాక మిగిలిపోయి, పులిసిపోయి , కడుపులో యాసిడ్లు పెరిగిపోతాయి. యాసిడ్ చర్మం మీద పడితే ఏమవుతుంది … ! కాలుతుంది ! అంతకన్నా సున్నితమైన ప్రేగుల్లో యాసిడ్ పెరిగితే లోపల ఎంత భుగభుగలాడిపోతుందో ఊహించండి …!! అదే కడుపులో మంటకూ , ప్రేగులోపల పుళ్ళు పడడానికి కారణం అవుతుందన్నమాట . ‘యాంటాసిడ్స్ ‘ కడుపులో పెరిగిన ఎసిడిటీని తగ్గిస్తాయి . అంతేగానీ కడుపులో అగ్నిని చల్లార్చేవి కావు . ఎసిడిటీ తగ్గితే జఠరాగ్ని ప్రజ్వరిల్లుతుంది .
జఠరాగ్ని ఎందుకు మందగిస్తుందంటే … ?
1. అన్నం అధికంగా తినడం వలన , అతిగా తిండిబోతుల్లా ప్రవర్తించడం వలన మాత్రమే అగ్నిమాంద్యం అనే ”గ్యాస్ ట్రబుల్ ” వ్యాధి వస్తుందనుకోనవసరం లేదు . ఉపవాసాలు పదే పదే చెయ్యడం కూడా అగ్ని మాంద్యానికి దారితీస్తుంది .
2. సగం ఉడికీ , సగం ఉడకని ఆహార పదార్దాలను తీసుకోవడం . ఒక టైం లేకుండా అకాలంలో భోజనం చెయ్యడం వంటివి కూడా అగ్ని చల్లారి పోవడానికి కారణాలే . ప్రొద్దుననగా పొయ్యి వెలిగించి మధ్యాహ్నమో సాయంత్రమో వంట చేస్తానంటే చల్లారిపోయిన ఆ నిప్పు మీద అన్నం ఎంత ఉడుకుతుందో వేళాపాళా లేకుండా భోజనాలు చేసేవారికి ఆకలి చచ్చిపోయాక అన్నం తింటే అంతే జీర్ణం అవుతుంది .
3. విందుభోజనాలలో ,మీటింగులలో , కాన్ఫరెన్స్ లలో ఆలస్యంగా భోజనాలు చెయ్యవలసి వస్తుంది . ఆలస్యం అయ్యింది కదా అని మిగిలున్న ఆకలికి సరిపడా తేలికగా భోజనం చెయ్యడం సాధ్యం కాదు . రకరకాల స్వీట్లు , హాట్లు , బిరియానీలు ఏ మాత్రం అరుగుదలకానివి ఎన్నెన్నో తినవలసి వస్తుంది . జీర్ణశక్తికి మించి ఆహారం తీసుకున్నప్పుడు దాని ఫలితం అనుభవించక తప్పదు .
4. మనకు సరిపడని ఆహార పదార్దాలను తినడం వలన అనేక జబ్బులొస్తాయి . తుమ్ములు , జలుబు , దగ్గు , ఆయాసం , ఉబ్బసం , దద్దుర్లు , దురదలు , వాంతులు , విరేచనాలు … ఇవన్నీ పడని వస్తువుల వలన వచ్చే లక్షణాలే . వీటితో పాటే పడని వస్తువులను తిన్నప్పుడు అగ్నిమాంద్యం కూడా ఒక వ్యాధిగా ఏర్పడుతుంది .
5. డైటింగ్ చెయ్యడం ఈనాటి ఆరోగ్య సూత్రాలలో ఒకటి . స్లిమ్ గా ఉండటం కోసం , బరువు తగ్గడం కోసం ‘డైటింగ్ ‘పేరుతొ ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు చేస్తుంటారు . ఈ మార్పుల్లో ఒక శాస్త్రీయత , ఒక పద్దతి ఉండకపోతే డైటింగ్ వికటించి అగ్నిమాంద్యం ఏర్పడుతుంది . ముఖ్యంగా రూక్షపదార్దాలు అంటే , ఏ మాత్రం స్నిగ్దత్వం లేకుండా రఫ్ గా ఉండేవి తినడం వలన అగ్ని నశించి పోతుంది . ”అగ్నికి ఆజ్యం ” అన్నారు . ఆజ్యం వేస్తే అగ్ని ప్రజ్వరిల్లుతుంది . అందుకని , ఆహారంలో పరిమితంగా నెయ్యి వేసుకొని తినాలి . నెయ్యి లేకుండా తింటే అది రూక్ష భోజనం అవుతుంది . నూనె కడుపులోకి వెళితే పైత్యం చేస్తుంది . వేడిని పెంచుతుంది . గ్యాస్ ట్రబుల్ ని కలిగిస్తుంది . కానీ , నెయ్యి పైత్యాన్ని , వేడినీ తగ్గించి చలవ చేస్తుంది . గ్యాస్ ని పెరగనియ్యదు . కాబట్టి డైటింగ్ చేసేవారు నూనె పదార్దాలను పూర్తిగా మానేసి అన్నంలో మాత్రం కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే మంచిది .
6. జ్వరాలు (ముఖ్యంగా టైఫాయిడ్ జ్వరం) వంటి వ్యాధులతో ఎక్కువకాలం భాదపడేవారికీ , కీళ్ళనొప్పులు , నడుంనొప్పి వంటి వ్యాధులకు నొప్పులు తగ్గే బిళ్ళలు అధికంగా వాడే వారికీ గ్యాస్ ట్రబుల్ రాకపోతే ఆశ్చర్యపడాలి .
7. రాత్రిపూట జాగరణలు , నైట్ డ్యూటీలు , సెకండ్ షో సినిమాలు , స్టార్ టీవిలకు అతుక్కుపోవడం , పగలంతా పడుకోవడం చేసేవారికి గ్యాస్ ట్రబుల్ పిలిస్తే పలుకుతుంది .
8. ఈర్ష్య , భయం , ద్వేషం , ఆందోళన , దిగులు , విచారం , టెన్షన్ లు ” స్ట్రెస్ ” వంటివి కడుపుమంటకు ముఖ్య కారణాలు .
గ్యాస్ ట్రబుల్ రాకుండా చేసే ఉపాయాలు :
అగ్నిమాంద్యాన్ని ఆధునిక వైద్యులు ” డిస్ పెప్సియా ” అంటారు . ఇది రెండు రకాలుగా ప్రముఖంగా కనిపిస్తుంది . అప్పటికప్పుడు ముంచుకొచ్చినట్లు వచ్చేది. దీర్ఘకాలంగా బాధపెడుతుంది .
1. అజీర్తి పెరిగినప్పుడు చాలా తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం, ప్రేగుల మీద ఓవర్ లోడ్ పడకుండా జాగ్రత్తగా ఉండటం , అగ్నిమాంద్యం ఏర్పడటానికి కారణమైన పనుల్ని పైన చెప్పినట్లుగా గుర్తించి మానెయ్యడం అవసరం . ఇది ఆయుర్వేద మందులు వాడేవారికే కాదు, ఇంగ్లీష్ మందులు వాడే వారిక్కూడా ఉపయోగించే సలహానే .
2. కడుపులో మంట , గ్యాస్ ట్రబుల్ ఉన్నవారు అవసరం అయితే విరేచనాలు అయ్యేందుకు ఏదైనా తీసుకొని బాగా ఝాడించినట్లు విరేచనాలు చేసుకొంటే గ్యాస్ ట్రబుల్ త్వరగా తగ్గుతుంది . నోట్లో నీళ్ళూరడం , గొంతులో మంట , తిప్పడం , వికారం ఉన్నవాళ్ళు ఉప్పునీరు త్రాగడం వంటి చిట్కాలు పాటించి వాంతులు ఒకటీ రెండు అయ్యేలా చేసుకొంటే ఇంకా మంచిది . తేలిక ఆహారాన్ని తీసుకోవడాన్ని ‘లంఖనం ‘ అంటారు . లంఖనం , వాంతి , విరేచనాలు మూడింటినీ చేసుకుంటే గ్యాస్ ట్రబుల్ వ్యాధిని , ప్రేగుపూత వ్యాధినీ , కడుపులో మంటనీ అవలీలగా నివారించవచ్చు . ఈ మూడు నియమాలూ పాటించకుండా కేవలం మందులు ఎన్నివాడినా చాలామందిలో పెద్దగా ఫలితం కనిపించకపోవచ్చు . అయితే , రోగ తీవ్రతని బట్టి , రోగి బలాన్నిబట్టి విరేచనాలు , వాంతులు , లంఖనం వంటివి ఎంతమోతాదులో ఉండాలో నిర్ణయించుకోవాలి . అవసరం అయితే వైద్యుడి సలహా పొందడం మంచిది .
3. శొంఠిని నేతిలో వేయించి , మెత్తగా దంచి బెల్లం వేసి నూరి కుంకుడు గింజంత ఉండలు కట్టుకొని ఓ సీసాలో నిలువబెట్టుకోండి . అగ్నిమాంద్యం ఏర్పడిన దాన్నిబట్టి పూటకు ఒకటిగానీ రెండుగానీ రెండుపూటలా తీసుకోండి . భోజనానికి ముందు తింటే మరీ మంచిది . ఇది రోజూ తీసుకుంటే నిరంతరం కడుపులో జఠరాగ్ని జ్వలిస్తూనే ఉంటుంది . సమస్త వ్యాధులకీ జఠరాగ్ని మందగించటమే కారణం అనే సంగతిని మరొక్కసారి గుర్తుచేస్తున్నాను .
4. తరచూ అజీర్తి చేస్తున్న వాళ్ళు , గ్యాస్ పెరిగి పోతున్నవారు , కడుపులో మంటతో బాధపడుతున్నవారు చక్కగా ఇంట్లో చేసుకోదగిన మంచి ఫార్ములా.
ఇవి : ధనియాలు , జీలకర్ర , శొంఠి సమభాగాలుగా తీసుకొని నేతిలో విడివిడిగా వేయించి మరపట్టించి తగినంత ఉప్పు కలుపుకొని అన్నంలో ఒకటిరెండు చెంచాలపొడిని కలుపుకొని తినండి . అలాగే మజ్జిగలో కలుపుకొని త్రాగవచ్చు . ఇందువలన జీర్ణశక్తి పెరుగుతుంది . ఈ పొడిని 2-3 చెంచాలు ఒక గిన్నెలో వేసి , ఎనిమిదిరెట్లు నీళ్లుపోసి నాలుగోవంతు నీరు మిగిలేలాగా బాగా మరిగించండి . చిక్కటి కషాయం వస్తుంది. గుడ్డలో వడకట్టి పంచదారగాని , ఉప్పుగాని కలుపుకొని త్రాగండి . తక్షణం ఆకలి పుట్టుకొస్తుంది . గొంతులోకి గ్యాస్ ఎగదట్టడం , మంట అన్ని తగ్గుతాయి .
5. చల్లటినీరు మాటిమాటికీ కాసిని కాసిని చొప్పున త్రాగుతుంటే కడుపులో మంట, గ్యాస్ తగ్గుతుంది . మజ్జిగ ఎక్కువగా త్రాగాలి . కానీ ఫ్రిజ్ లో పెట్టకుండా ఏ పూటది ఆపూట తోడుపెట్టి , చిలికి , పల్చగా చేసుకొని పులవకుండా త్రాగితే బాగా పనిచేస్తాయి. పెరుగు చిలికిన తర్వాత చల్లని నీళ్ళు కలుపుకోవచ్చు కానీ , మజ్జిగని ఫ్రిజ్ లో పెట్టకండి .
6. కడుపులో వాతం ఎక్కువగా చేరినప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ వాయువు వెళ్తూ ఉంటుంది . నీళ్ళలో చిటికెడంత ఉప్పు కలిపి గోరువెచ్చగా త్రాగితే వాతం తగ్గి కడుపులోంచి టపాకాయలు పేలడం ఆగుతాయి . పొట్టమీద వెచ్చగా కాపడం పెట్టడం వలన పొట్ట కండరాలు బిగదీయడం , లోపల పొట్లు , నొప్పి తగ్గి సుఖవిరేచనం అవుతుంది .
రాబోయే కొత్త వ్యాధులకు సూచిక గ్యాస్ ట్రబుల్ :
ఆపానవాయువులు పుట్టకుండా జాగ్రత్త పడాలి . జఠరాగ్నిని కాపాడుకొంటూ ఉంటే అవి ఉత్పన్నం కావు . కానీ , అగ్నిమాంద్యం ఏర్పడి గ్యాస్ పుట్టిన తర్వాత ఆపానవాయువులు బయటకు రాకుండా ఆపాలని ప్రయత్నిస్తే అనేక వాతవ్యాధులు పుట్టుకొస్తాయని ఆయుర్వేద శాస్త్రం హెచ్చరిస్తోంది . గ్యాస్ ట్రబుల్ వస్తోందంటే జీర్ణశక్తి నశిస్తోందని అర్ధం . దాన్ని తొలిదశలోనే జాగ్రత్తగా కనిపెట్టి అగ్నిని వృద్ధిచేసుకోవడం ప్రారంభించాలి . లేకపోతె ఇరవై ఏళ్ళకే 60 ఏళ్ళను చవి చూడవలసి వస్తుంది .
రాబోయే కొత్త వ్యాధులకు సూచిక గ్యాస్ ట్రబుల్ అని గుర్తించాలి . కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్ , పేగుపూత , మలబద్ధకం , జిగురు విరేచనాలు , వాంతి , వికారం , పుల్లని త్రేన్పులు , గుండెలో మంట , నొప్పి ఇవన్నీ ఇంచుమించుగా సమీప వ్యాధి లక్షణాలే . వీటన్నిటికీ మూలకారణం … అగ్నిమాంద్యం … జీర్ణశక్తి తగ్గిపోవడం (లేదా) జఠరాగ్ని మందగించడం , వాము , సోంపు , ధనియాలు , జీలకర్ర , పిప్పళ్ళు , మిరియాలు , అల్లం , శొంఠి , దాల్చినచెక్క , ఆకుపత్రి , కరివేపాకు , కొత్తిమీర , వెల్లుల్లి , షోడాబైకార్బ్ (తినే షోడా ఉప్పు )… ఇవన్నీ అగ్నిని వర్ధిల్లచేసేవే . గట్టిగా చెప్పాలంటే , కడుపులో పొయ్యిని రాజేసేవే. వీటిని ఎప్పుడూ ఏదో ఒక రూపంలో తరచూ తీసుకొంటూ ఉండేవారికి గ్యాస్ ట్రబుల్ రాదు గాక రాదు .
Book an appointment with us. We are just a Phone call away, Let us Talk.
Phone no : +91 9989759719
0 Comments